- 12లోగా రాజీనామాలు చేయకుంటే జనంలో తిరగలేరు
- ‘ప్రజాగర్జన’ను విజయవంతం చేయాలి
- టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులపై సిద్ధిపేట ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి. హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. తెలంగాణ కోసమే ఉద్యమిస్తున్న కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆ పార్టీ నేతలకు లేదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి, ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ పదవులకు దూరంగా ఉండడమే కాదు.. తెలంగాణ వచ్చినా పదవులకు దూరంగానే ఉంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ‘తెలంగాణ వచ్చే వరకూ పదవులకు దూరంగా ఉంటామని ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు.’ అని విమర్శించారు. ‘తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ కాపాలాకుక్కలా ఉంటానని ప్రకటించారు. అటువంటి ఉద్యమకారుడిని మీరు విమర్శిస్తారా..?’ అంటూ టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం రావాలన్న చిత్తశుద్ధి మీకు ఉంటే, వెంటనే పదవులకు రాజీనామా చేసి, ఆమోదించుకోవాలి.’ అని సవాల్ విసిరారు. తెలంగాణ కోసం ఉద్యమించినందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, మీ మీద ఏమైనా కేసులున్నాయా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన నిలదీశారు.
పదవులు పట్టుకొని వేలాడుతున్న మీరా మాకు నీతులు చెప్పేది అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులు లేకుంటే ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొంటుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం మంత్రిగా విధుల్లో పాల్గొంటున్నామని చెప్పిన పంచాయతీరాజ్ మంత్రి జానాడ్డి.. తెలంగాణ ఎవరు తెస్తారో చెప్పాలన్నారు. పంద్రాగస్టు నాడు జాతీయ జెండాలు ఎగిరేసేందుకు ఉరుకులాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే ఊపుతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదీ బిడ్డనని చెప్పుకుంటున్నముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఈ నెల 12లోగా రాజీనామా చేయాలని, చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. రాజీనామా చేయకుంటే ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి. మీకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటా.’ అని యువతకు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 12న జరిగే ‘ప్రజాగర్జన’కు లక్షలాదిగా తెలంగాణ అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment