JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Friday, 5 August 2011

14 ఎఫ్-అబద్ధాలూ, మోసాలూ


రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ అనే ఉప నిబంధనను తొలగించాలని ఎంతో కాలంగా సాగుతున్న ఆందోళన కీలక దశకు చేరింది. ఈ సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మనం ఎంత అజ్ఞానుల, అబద్ధాలకోరుల, మూర్ఖుల, కుట్రదారుల పాలనలో ఉన్నాం గదా! అని వెయ్యిన్కొకటోసారి ఆశ్చర్యం కలుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫేర్స్ (సిసిపిఎ- రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం) అనేదొకటి ఉంది. దీనిలో ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె. ఆంటోనీ, పి. చిదంబరం,ఎస్.ఎం.కృష్ణ సభ్యులు. వీరిలో ప్రతిఒక్కరూ కనీ సం నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం గడిపారు.అందరికందరూ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా చాలా కాలంగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ ఇంత అనుభవజ్ఞుల ఉప సంఘం ఆగస్టు 1న సమావేశమై ఒక పనికిమాలిన, అన్యాయమైన, అనవసరమైన నిర్ణయం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులలోం చి 14 ఎఫ్ ఉపనిబంధనను తొలగించమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేత మరొక తీర్మానం చేయించి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. సమావేశం అయిపోయిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చిదంబరం ‘2010 జనవరిలోనో ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆ తీర్మానం చేసి పంపింది.
తర్వాత చాలా మార్పులు జరిగాయి. కనుక మళ్లీ తీర్మానం చేసి పంపాలని సిసిపిఎ నిర్ణయించింది. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’ అన్నారు.
‘2010 జనవరిలోనో ఎప్పుడో’ అట.
హార్వర్డ్ విద్యావంతుడూ అంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యుడూ అయిన ఈ పెద్దమనిషికి కనీసం తాను మాట్లాడుతున్న విషయం సంపూర్ణంగా తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేనట్టుంది. ఆ తీర్మానం జరిగింది 2010 మార్చ్ 18న. చిదంబరం ప్రకటన తర్వాత మళ్లీ తీర్మానం చేయాలా? వద్దా అని శుష్కమైన, మోసపూరితమైన, అనవసరమైన చర్చ జరుగుతున్నది. నిజానికి ఈ విషయంలో ఇప్పుడే కాదు, 2010లో కూడా శాసనసభ తీర్మానం అవసరంలేదు. ఎందుకంటే సవరణ అవసరమైన ఉత్తర్వులు రాష్ట్రపతివి. కేంద్ర ప్రభుత్వం తయారు చేసి రాష్ట్రపతి చేత విడుదల చేయించిన వి. ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసి, 371-డి అధికరణం చేర్చి రాష్ట్రపతికి ఆ హక్కు కల్పించారు.
ఆ ఉత్తర్వులలో ఏదైనా తప్పు దొర్లితే, దొర్లిందని ఎవరయినా ఎత్తిచూపినప్పుడు, ఆ ఎత్తిచూపినవారు తీర్మానం చేయవలసిన అవసరమేమీ లేదు. ఆ ఉత్తర్వులు తయారుచేసినవారో, విడుదలచేసినవారో సవరణ ప్రకటిస్తే సరిపోతుంది. కానీ సాధారణమైన పనులను కూడా సంక్లిష్టంగా మార్చే ప్రభుత్వ యంత్రాంగం ఇది. ప్రజాజీవనానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ మాయగా మార్చి, ఎవరికీ తెలియకుండా తిమ్మిని బమ్మిని చేయడం ఈ రాజకీయ వ్యవస్థ ఓ కళగా అభివృద్ధి చేసింది.
ఎవరు తప్పుచేశారో వారు సవరించుకోవాలని, అది చాలా సులభంగా జరగవచ్చునని మామూలు మనుషులం అనుకుంటాం. కానీ ఆ తప్పు ప్రభావం ఎవరిమీద పడుతుందో వాళ్లు అష్టకష్టాలు పడి, బలమైన తమ ప్రత్యర్థులను ఒప్పించి, వారే మెజారిటీగా తాము మైనారిటీగా ఉన్న సభలో తీర్మానాన్ని ఆమోదింపజేసి పంపిస్తేనే సవరిస్తాము అని చెప్పే దగుల్బాజీ రాజకీయ వ్యవస్థ ఇది. చచ్చో చెడో, బ్రహ్మ ప్రయత్నం చేసి అవసరం లేకపోయినా ఒకసారి అటువంటి తీర్మానం చేసి పంపిస్తే, దానిమీద ఏ చర్యా తీసుకోకుండా పదిహేను నెలలు తాత్సారం చేసి, ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టండి అని అడిగే బేహద్బీ ఈ ప్రజావ్యతిరేక వ్యవస్థకే చెల్లింది. అసలింతకూ ఈ మోసం ఈ సిసిపిఎ తోనే, చిదంబరం ప్రకటనతోనే ప్రారంభం కాలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల తయారీలోనే ఈ మోసానికి, అబద్ధానికి బీజం ఉంది. ఈ విషాద, దుర్మార్గ గాథ అక్కడి నుంచే ప్రారంభించాలి.
1947కు ముందరి చట్టాలేవైనా, ప్రత్యేకంగా రద్దు చేసినవి మినహా, స్వతంత్ర భారతంలో కూడా కొనసాగుతాయనీ, అందువల్ల హైదరాబాద్ రాజ్యంలో 1919లో జారీ అయిన ముల్కీ నిబంధనలు కూడా చెల్లుతాయనీ, సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఈ తీర్పును నీరు గార్చడానికి కేంద్ర ప్రభుత్వం 1972 డిసెంబర్‌లో ముల్కీ చట్టం అనే కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలో తెలంగాణకు అనుకూలంగా ఏవో కొద్దిపాటి రక్షణలు ఉంటే అవి కూడా ఉండగూడదని, అసలు తమకు ప్రత్యేక రాష్ట్రమే కావాలని జై ఆంధ్ర ఉద్యమం మొదలయింది. దానితో మళ్లీ ఒకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష విజృంభించింది. ఆ నేపథ్యంలో 1973 జనవరిలో రాష్ట్రపతి పాలన విధించి, అక్టోబర్‌లో సూత్రాల పథకం ప్రతిపాదించి, అభివృద్ధికి నోచుకోని రెండు ప్రాంతాలనూ చల్లబరుస్తున్నానని, ఇక రాష్ట్ర విభజన అవసరం లేదని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు.
ఆ ఆరు సూత్రాల పథకంలో మూడో అంశం ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యక్ష నియామకాలలో కొంతమేరకు స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికులను నిర్వచించడం’, ఆరో అంశం ‘పై ఐదూ అమలయితే ఇకనుంచి (తెలంగాణ) ప్రాంతీయమండలి, ముల్కీ నిబంధనలు అనవసరమైపోతాయి’
పై ఐదు అంశాలు అమలయినా కాకపోయినా ఈ ఆరో అంశం మాత్రం వెంటనే అమలులోకి వచ్చింది. డిసెంబర్‌లోనే ముల్కీ రూల్స్ రద్దు చట్టం తెచ్చారు. మూడో అంశాన్ని అమలు చేయడం కోసం రాజ్యాంగానికి 32వ సవరణచేసి, అధికరణం 371-డి చేర్చి, ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. మామూలుగా ఎక్కడివారయినా, ఎక్కడికయినా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చునని చెప్పే చట్టాలు గాని, రాజ్యాంగ అధికరణం 16 గానీ ఈ ప్రత్యేక అధికారాలకు అడ్డురావని స్పష్టంగా చెప్పారు.
అయినా, రాష్ట్రపతికి ఈ ప్రత్యేక అధికారాలు 1973 డిసెంబర్‌లో సమకూరితే, 1975 అక్టోబర్ దాకా ఆ అధికారాన్ని ఉపయోగించుకున్న ఉత్తర్వులు రాలేదు. తెలంగాణకు పనికొచ్చే ముల్కీ నిబంధనలు రద్దు చేయడమేమో క్షణాల మీద జరిగిపోయింది. తెలంగాణ వారి ఉద్యోగాలను ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టకుండా తీసుకోవలసిన రక్షణ చర్య కాగితం మీదికి రావడానికి మాత్రం రెండు సంవత్సరాలు పట్టింది. ఆ ఉత్తర్వులు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, స్థానికులను నిర్వచించాయి. కానీ ఈ ఉత్తర్వులు కాగితం మీదికి రావడం అనేక కుట్రలతో, కుహకాలతో జరిగింది. పధ్నాలుగా పరిచ్ఛేదాలు. మూడు షెడ్యూళ్లతో సుదీర్ఘమైన ఈ ఉత్తర్వులు రాసిన వారెవరో, రాయించిన వారెవరో, ఆ ముసాయిదాను తెలంగాణ నాయకులు, మేధావులు చూశారో లేదో తెలియదు. కానీ చాలా తెలివిగా తెలంగాణ వ్యతిరేక అంశాలు ఇందులో జొప్పించబడ్డాయి. మొత్తం ఉత్తర్వులు తయారైన తీరు మీద వివరమైన విశ్లేషణ అవసరం. కానీ ఇక్కడ మచ్చుకు రెండు చూద్దాం.
ఒకటి. ఇప్పటిదాకా చెప్పిన నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజలందరికీ (పాత హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరికీ) సమానంగా ప్రభుత్వోద్యోగాలలో రక్షణ కల్పించిన ముల్కీ నిబంధనల స్థానంలో వచ్చిన స్థానిక జోన్ల విభజన తెలంగాణనంతా ఒకే జోన్‌గా చూసి ఉండవలసింది. 1969 ఉద్యమ డిమాండ్ అదే. కానీ చాలా విచిత్రంగా రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణను రెండు జోన్లుగా విభజించి, తెలంగాణలోనే కొన్ని జిల్లాల అభ్యర్థులు మరికొన్ని జిల్లాల్లో స్థానికేతరులు అయ్యే పరిస్థితి కల్పించాయి. మరోవైపు నిజంగా ఏ స్థానికేతరులు (అంటే కోస్తాంధ్ర, రాయలసీమ-లేదా పాత మద్రాసు రాష్ట్రీయులు) సాగించిన ఉద్యోగాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో ఆ స్థానికేతరులు దొడ్డిదారిన స్థానికులు అయిపోవడానికి అన్ని అవకాశాలు సమకూరాయి.
రెండవ కుట్ర. స్థానికేతరులను తెలంగాణ ఉద్యోగాలలో ప్రవేశపెట్టడానికి కల్పించిన మినహాయింపులు. రాష్ట్రపతి ఉత్తర్వులలో చివరి పరిచ్ఛేదమైన 14 ‘పై ఉత్తర్వులు ఈ కింది వాటికి వర్తించవు’ అంటూ ఆరు మినహాయింపులు ఇచ్చింది. అవి.
‘ఎ) రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ లోని ఏ ఉద్యోగమైనా.
బి) శాఖాధికారి కార్యాలయంలోని ఏ ఉద్యోగమైనా.
సి) ప్రత్యేక అధికారి దగ్గర, సంస్థలలో ఏ ఉద్యోగమైనా.
డి) రాష్ట్రస్థాయి కార్యాలయాలలో, సంస్థలలో ఏ ఉద్యోగమైనా.
ఇ) భారీ అభివృద్ధి పథకాలలో నాన్ గెజిటెడ్ కాని ఏ ఉద్యోగమైనా.
ఎఫ్) హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం 1348 ఫసలీ లోని సెక్షన్ 3, క్లాజ్ బిలో నిర్వచించిన ఏ పోలీసు అధికారి ఉద్యోగమైనా’.
ఈ మొదటి ఐదు మినహాయింపులను గత ముప్ఫై ఐదు సంవత్సరాలలో ఎన్ని రకాలుగా, ఎంతగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఇక్కడ స్థలం సరిపోదు. సెక్రటేరియట్ సంబంధంలేని ఉద్యోగాలను సెక్రటేరియట్ ఉద్యోగాలుగా చూపారు. అవసరమైన వాటినీ కాని వాటినీ కూడా శాఖాధికారి కార్యాలయాలుగా ప్రకటించి వాటి సంఖ్యను ఐదు రెట్లు పెంచారు. ప్రభుత్వ శాఖలుగా రావలసిన చాలా కార్యాలయాలను ప్రత్యేక అధికారి కింద, సంస్థ కింద చూపించారు. జిల్లాజోన్ స్థాయి కార్యాలయాలను కూడా రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా ప్రకటించారు. ఇలా సెక్రటేరియట్ పాలనాధికారంలో కోస్తాంధ్ర, రాయలసీమ అధికారులు చక్రం తిప్పుతూ ఉండడం వల్ల ఈ పనులన్నీ జరిగాయి. మినహాయింపుల దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. తెలంగాణ అభ్యర్థులు తమకు న్యాయంగా రావలసిన కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ అక్రమాల మీద గిర్‌గ్లాని కమిషన్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర విశ్లేషకులు మాట్లాడుతుండగానే చివరి మినహాయింపు అయిన 14ఎఫ్ రంగం మీదికి వచ్చింది. సుప్రీంకోర్టు దాకా కేసు నడవడం, అనవసరమైన, అర్థరహితమైన ఫ్రీజోన్ అనే మాట రావడం ఇక్కడ చెప్పుకోనక్కరలేదు. కానీ ఆ ఉప నిబంధనలో హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టాన్ని ఉదహరించడం కేవలం ఆ చట్టంలో సెక్షన్ 3 క్లాజ్ బిలో పోలీసు అధికారి అంటే ఉన్న నిర్వచనం కోసం మాత్రమే. ఆ నిర్వచనం కిందికి రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ వస్తారు.
అంటే రాష్ట్రపతి ఉత్తర్వులలోని మినహాయింపును వాడుకొని రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తెలంగాణ అభ్యర్థులకు ఎటువంటి రక్షణా, వాటా లేకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నమిది. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం కొనసాగినంత కాలం తెలంగాణ ప్రజల, ఉద్యోగార్థుల, నిరుద్యోగుల, అభ్యర్థుల ప్రయోజనాలు ఎంత దారుణంగా, కుట్ర పూరితంగా, మోసపూరితంగా దెబ్బతింటాయో చూపడానికి ఇంతకన్న వేరే ఉదాహరణ కావాలా?
[నమస్తే తెలంగాణ నుండి]

No comments:

Post a Comment